KTR: దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై సభలో చర్చ పెట్టండి 4 d ago

featured-image

ఫార్ములా- ఈ రేస్ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా తన మీద అనేక నిరాధార ఆరోపణలు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసారు. ఇదే విషయం మీద ఈ వారం మీ ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో గంటన్నర సేపు చర్చ కూడా జరిగినట్టు వార్తా కథనాలు వచ్చాయి. ఇదే అంశం మీద కేసులు నమోదు చేస్తామని, గవర్నర్ ఆమోదం వచ్చిందని రకరకాల లీకులు ముఖ్యమంత్రి కార్యాలయం నుండి మీడియాకు ఇస్తున్నారని కేటీఆర్ అన్నారు.


ఈ అంశం మీద నాలుగు గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసన సభలో నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరిగితే నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా- ఈ రేస్ నిర్వాహకులతో ఒక ఒప్పందం చేసుకున్నదని చెప్పారు. 2023లో విజయవంతంగా రేస్ జరిగి అన్ని వర్గాల మన్ననలు అందుకున్నదని అన్నారు. ఈ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల రూపాయల లబ్ది చేకూరింది అని నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసిందని గుర్తు చేసారు. 2024లో మరో దఫా రేస్ జరగవలసి ఉండగా మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం జరిగిందని విమర్శించారు. అప్పటి నుండి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి, ఇందులో ఏదో జరిగింది అనే అపోహలు సృష్టించే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని కేటీఆర్ మండిపడ్డారు.


నిజానికి ఫార్ములా- ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగింది. రేస్ నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయని అన్నారు. అని ఇదివరకే తాను వివరంగా చెప్పడం జరిగిందని, అయినా మీ ప్రభుత్వం మాత్రం దుష్పచారం మానడం లేదని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కు ఉందన్నారు. కనుక శాసనసభలో ఈ అంశంపై చర్చపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేసారు. అన్ని విషయాలు సవివరంగా రాష్ట్ర ప్రజలకు శాసన సభ వేదికగా చెబుదామని వెల్ల‌డించారు. శాసన సభ సెషన్ జరుగుతున్నది కనుక మీకు అనుకూలమైన రోజే ఈ చర్చను పెట్టండి అని కేటీఆర్ పేర్కొన్నారు.


మరోసారి చెబుతున్నాను, ఫార్ములా-ఈ రేస్‌అంశంలో ఎలాంటి అవకతవకలు కానీ, అవినీతి గానీ జరగలేదని కేటీఆర్ స్పష్టం చేసారు. రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి చేసే ఈ రేస్‌ను కేవలం మీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బలి చేశారని, దీనిపైన శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజానిజాలేమిటో నిగ్గుతేలుతాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD